షర్మిలకు చెక్, సీన్ రివర్స్ – ఢిల్లీలో కీలక పరిణామం..!!
షర్మిలకు చెక్, సీన్ రివర్స్
షర్మిలకు చెక్, సీన్ రివర్స్ – ఢిల్లీలో కీలక పరిణామం..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవు తోంది. కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఏపీలో ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన ఎక్కువగా టార్గెట్ చేసినట్లు విమర్శలు ఉన్నాయి.సొంత పార్టీ నేతలను సమన్వయం చేసుకోవటం లేదంటూ ఢిల్లీకి ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
ఏం జరుగుతోంది
అనేక తర్జన భర్జనల తరువాత ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నియమితులయ్యారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ లక్ష్యంగా ప్రధానంగా షర్మిల ఏపీలో రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. వ్యక్తిగత వివాదాల పైన పదే పదే ప్రస్తావన చేయటం కూడా పార్టీలో చర్చగా మారింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ పైన కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో మాత్రం షర్మిల ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైనే ఎక్కువగా గురి పెట్టినట్లు వస్తున్న కథనాలతో కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీకి మేలు చేసే విధంగా పీసీసీ చీఫ్ వ్యవహరించ టం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వరుస ఫిర్యాదులు
కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే సమయంలో పలువురు పార్టీ సీనియర్లు షర్మిల కు మద్దతుగా నిలిచారు. కానీ, కాల క్రమేణా వారంతా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పరిమిత సంఖ్యలో నేతలు మాత్రమే షర్మిల నిర్ణయించిన కార్యక్రమాలకు పరిమితం అవుతున్నారు. షర్మిల వైఖరి పైన గుర్రుగా ఉన్న సీనియర్లు ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాల గురించి హైకమాండ్ కు సమాచారం పంపిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల సోషల్ మీడియా వేదికగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సి ఉండగా..ఎన్నికల్లో ఓడిన వైసీపీ ని లక్ష్యంగా చేసుకోవటం వెనుక పర్సనల్ అజెండా ఉందని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా షర్మిల వ్యవహరిస్తున్న తీరు పైన పార్టీ ముఖ్యులు ఢిల్లీలో అధినాయకత్వంతో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది.
హైకమాండ్ దిశా నిర్దేశం
షర్మిల ఏదైనా కార్యక్రమం పార్టీ తరపున ఖరారు చేస్తే కనీస స్పందన ఉండటం లేదనే వాదన వినిపిస్తోంది. పార్టీ నిరసనలకు కార్యకర్తలకు కూడా సమాచారం అందటం లేదని చెబుతున్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కూడా షర్మిలను టార్గెట్ చేశారు. పార్టీలో అందరిని కలుపుకుపోకపోతే.. కాంగ్రెస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. కూటమి పార్టీలు చేరికలకు ఆహ్వానం పలుకుతున్నాయి. అటు వైసీపీ ఎన్నికల్లో ఓడిన తరువాత ప్రస్తుతం సమస్యల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇది సరైన సమయం అయినప్పటికీ, షర్మిల మాత్రం పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేయటం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో, ఇప్పుడు షర్మిలకు పార్టీ నాయకత్వం ఎలాంటి మార్గ నిర్దేశం చేస్తుందనేది చూడాల్సి ఉంది.