Blog

విశాఖ ఉక్కుపై మోదీ డబుల్ గేమ్ ఆడుతున్నారు: వైఎస్ షర్మిల

కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతగా కేంద్రం తీరు ఉందని విమర్శించారు.

ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ఇక ముడి పదార్ధాలు నిండుకున్నాయని, కొనేందుకు చిల్లిగవ్వ కూడా లేదని, ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమే అంటూ యాజమాన్యం చేతులెత్తేస్తుంటే .. మోదీకి కనీసం చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. పోనీ అప్పు తెద్దామా అంటే మూడోసారి గద్దెనెక్కిన మోదీ .. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కను చంపాలి అంటే పిచ్చి దానిగా చిత్రీకరించినట్లు.. విశాఖ స్టీల్ కు రూపాయి సహాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారని దుయ్యబట్టారు. నిధులు ఇవ్వకుండా సైలెంట్ గా నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు.

త్వరలోనే ఆదానీ, అంబానీ, జిందాల్ లాంటి వాళ్లకు కట్టబెట్టే మూహూర్తం కూడా ఫిక్స్ చేశారని షర్మిల అన్నారు. ఏపీ బీజేపీ నేతలను, కూటమిలో భాగస్వామ్యం అయిన టీడీపీ, జనసేన పార్టీలను హెచ్చరిస్తున్నాననీ, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేకుంటే .. ప్లాంట్ బలోపేతంపై మీకు చిత్తశుద్ది ఉంటే .. తక్షణం ఆర్ధిక సహాయం ప్రకటన చేయాలని, కావాల్సిన ముడి పదార్ధాలు వెంటనే సమకూర్చాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల ట్వీట్ చేశారు.

Related Articles

2 Comments

Leave a Reply to Mana Jana Pragathi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button