పూర్వ’0గా విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఉరవకొండ
ఏరా ఎలాగున్నావ్.. ఎన్నాళ్లయిందో మిమ్మల్ని చూసి. ఇంట్లో అందరూ బాగున్నారా అంటూ బాల్య స్నేహితులు నాలుగు దశాబ్దాల తరువాత కలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. షష్టి పూర్తి చేసుకునే తరుణం ఆసన్నమవుతున్న సమయంలో ఒక్కసారిగా కలుసుకోవడంతో అందరూ బాలలుగా మారి ఆనందోత్సాహాలతో తమ అమూల్యమైన సమయాన్ని కొద్ది గంటల పాటు గడిపారు. కరచాలనాలు, కౌగిలింతలతో తమ కలయికను పూర్తి కానివ్వక చిన్నప్పటి అనుభవాలను నెమరు వేసుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఎన్నో భావోద్వేగాల మధ్య తమకు దొరికిన ఆ కొద్ది మధుర క్షణాలను ఆనందంగా గడిపారు. ఏదో తెలియని ఆనందం, వింత అనుభూతుల మధ్య వారంతా కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాల తరువాత తన ఒడిలో విద్యనభ్యసించిన చిన్నారులను చూసుకొని వారు చదివిన పాఠశాల కూడా ఎంతో మురిసిపోయింది.
ఆత్మీయ పలకరింపులతో మురిసిపోయారు..
కాటా వెంకటప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు. పాఠశాలలో 1978 లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 46 ఏళ్ల తరువాత మొదటిసారిగా కలుసుకున్నారు. సుమారు 40 మంది పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆప్యాయ పలకరింపులతో సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులను ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. అనంతరం పాఠశాలలో తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. వారికి అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు హనుమంతప్ప,కాడప్ప, నాగరాజు,అక్కులప్ప ను సన్మానించారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేసి అనంతరం తమ జ్ఞాపకాలను, అనుభవాలను కుటుంబ సభ్యుల పరిచయాలతో తమకున్న కాలాన్ని గడిపారు. అనంతరం పాఠశాల అభివృద్ధికై ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలతకు లక్ష 25 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమం మహబూబ్ దౌల, షౌకత్ అలీ, లక్ష్మీనారాయణ, మనోహర్, చక్రపాణి ఆధ్వర్యంలో సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, స్థానికులు పట్టా ఖాజాపీరా మరియు పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు సోమశేఖర్, కరణం అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.