
దస్తగిరి ఆరోపణలు అవాస్తవం
తొండూరు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఘర్షణ లో సకాలంలో స్పందించనందునే
గన్ మెన్ విధుల నుండి తప్పించాం
అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు
జిల్లా ఎస్.పి
కడప మన జనప్రగతి అక్టోబర్ 10: – మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి అనే వ్యక్తి తన గన్ మెన్లను అనవసరంగా మారుస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఖండించారు. ఈ మేరకు జిల్లా ఎస్.పి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మే నెల 29 న నగదు లావాదేవీల విషయమై దస్తగిరి కి తమ్ముడు వరుసైన మస్తాన్ వలి పై పెద్ద గోపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసేందుకు తొండూరు పోలీస్ స్టేషన్ కు రావడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో దస్తగిరి గన్ మెన్ తో స్టేషన్ కు రావడం జరిగింది. స్టేషన్లోనే ఇరువర్గాల వారు ఘర్షణ పడడంతో ఈ విషయమై అప్పట్లో తొండూరు పి.ఎస్ లో ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్.పి వివరించారు. పై విషయంలో దస్తగిరి గన్ మెన్ సకాలంలో స్పందించక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్ల గన్ మెన్ విధుల నుండి తప్పించడం జరిగిందని మరియు గన్ మెన్ లను మార్చడమనేది పరిపాలనా పరమైన అంశాల్లో అంతర్భాగమని ఎస్.పి తెలిపారు. రక్షణ కోసం గన్ మెన్లను కేటాయించబడిన వ్యక్తుల భద్రత దృష్ట్యా మార్చడం జరుగుతుందని ఎస్.పి వివరించారు. దస్తగిరి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఖండించారు. ఈ విషయమై అవాస్తవ ప్రచారాలు చేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరించారు.