సూక్ష్మ దృష్టితో పోలింగ్ ప్రక్రియపై.. నిఘా ఉంచాలి
సూక్ష్మ దృష్టితో పోలింగ్ ప్రక్రియపై.. నిఘా ఉంచాలి
సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్
కడప, ఫిబ్రవరి 10 : ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు.. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై సూక్ష్మ దృష్టి సారించి, అప్రమత్తంగా, చాకచక్యంగా.. వ్యవహరించాలని.. ఎన్నికల సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల)కు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్ సూచించారు.బుధవారం స్థానిక కలెక్టరేట్ సభా భవన్ లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే.. మైక్రో అబ్జర్వర్లకు జేసీ (సంక్షేమం) ధర్మచంద్రారెడ్డి అధ్యక్షతన ఎన్నికల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు రంజిత్ బాషా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ శిక్షణా కార్యక్రమానికి హాజరైన సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) కు.. ఎన్నికల నిర్వహణలో వారు నిర్వర్తించాల్సిన విధులను తెలియజేసి, పలు సూచనలు అందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రాధాన్యతతో, పారదర్శకంగా సూక్ష్మ దృష్టితో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర స్థాయి అధికారి రంజిత్ బాష (ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్)ను నియమించిందన్నారు. ఎన్నికలు జరిగే అన్ని మండలాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. వీరంతా జిల్లా పరిశీలకుల మార్గదర్శకాలను అనుసరించి.. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. స్థానిక ప్రజలు, సంబంధాలు, ప్రమేయం లేకుండా.. పోలింగ్ నిర్వహణను సూక్ష్మ దృష్టితో పరిశీలించాల్సి వుంటుందన్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి.. మైక్రో అబ్జర్వర్లకు డ్యూటీల కేటాయింపు, పోలింగ్ కేంద్రాల్లో విధుల వివరాలను.. వారి ఫోన్ నెంబర్లకు ఎస్.ఎం.ఎస్., వాట్సాప్ ద్వారా రెండు రోజులు ముందుగా తెలియజేయడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లకు వసతి సదుపాయాలు సంబందిత ఎంపిడివోలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శిక్షణా కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను పాటిస్తూ.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల విధి నిర్వహణలో ప్రతి అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ.. చిత్తశుద్ధితో, భాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు రంజిత్ బాషా మాట్లాడుతూ… 25 పాయింట్లతో కూడిన అనెక్సర్-2 ఫారాలను పోలింగ్ స్టేషన్ కేటాయింపు వారీగా అందించడం జరుగుతుందన్నారు. కేటాయించిన లోకేషన్ల వారీగా సంబందిత పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ప్రక్రియను సునిశితంగా పరిశీలించి రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా అబ్జర్వర్లు.. మైక్రో అబ్జర్వర్ల సందేహాలను అడిగి తెలుసుకుని నివృత్తి చేయడంతో పాటు, పలు సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ శిక్షణా కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ పిఓ డా.ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉపధికల్పన అధికారి దీప్తి, ఎన్నికల విధులకు హాజరయ్యే… పోలింగ్ అధికారులు, తదితర పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.