వైసీపీ నేత దారుణహత్య

సత్య సాయి జిల్లాలో దారుణం జరిగింది. హిందూపురం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి (46) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్యకు గురవడం పట్టణంలో కలకలం రేపుతోంది. తన ఇంటి ముందు కారులో దిగుతుండగా కళ్లల్లో కారం పొడి చల్లి, ఆపై వేట కొడవళ్ళతో నరికి దారుణంగా హత్య చేశారు. ఆయన శరీరంపై 18 చోట్ల నరికిన కత్తిపోట్లు ఉన్నాయంటే ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. తన ఇంటి ముందే దారుణహత్యకు గురి కావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.అసలేం జరిగిందంటే..
వైసీపీ నేత రామకృష్ణారెడ్డి చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దులో దాబా నడుపుతున్నారు. రోజులాగే శనివారం రాత్రి సైతం దాబా మూసివేసి కారులో ఇంటికి చేరుకున్నారు. కారు డోర్ తెరిచి కిందకి దిగగానే కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనను చుట్టుముట్టారు. మొదట కళ్లల్లో కారం పొడి చల్లారు. ఆ వెంటనే తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో రామకృష్ణారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో వైసీసీ నేత కుప్పకూలిపోయారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో వైసీపీ నేత అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.రెండు బైకులపై మొత్తం ఐదుగురు దుండగులు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు బైకులపై రెడీగా ఉండగా, మిగతా నిందితులు వేట కొడవళ్లతో రామకృష్ణారెడ్డిని విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. ఆయన శరీరంపై 18 చోట్ల నరికినట్లు తెలుస్తోంది. హత్య చేసిన వెంటనే నిందితులు అదే బైకులపై పరారయ్యారు. ప్లాన్ ప్రకారం హత్యకు రావడంతో నిందితులు తమను ఎవరూ గుర్తించకూడదని, ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.