రైల్వేస్టేషనులో వివిధ అభివృద్ధి పనులు
నేటి నుంచి పలు రైళ్ల రద్దు, దారి మళ్లింప నగరం
రాజమహేంద్రవరం మన జనప్రగతి
రాజమహేంద్రవరంలోని రైల్వేస్టేషనులో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.యార్డ్ విస్తృతి, నాన్-ఇంటర్ లింకింగ్ పనులు జరుగుతున్నాయి. గతంలో సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్న ఉత్తర, దక్షిణ క్యాబిన్లను పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో అత్యంత ఆధునిక ఆర్‌ఆర్‌ఐ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.విజయవాడ రైల్వేస్టేషనులో ప్రస్తుతం ఆ విధానం అమల్లో ఉంది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో నాలుగు, అయిదు ప్లాట్‌ఫామ్‌లను అందుబాటులోకి తేనున్నారు.
పనులను వేగంగా పూర్తి చేసేందుకు వివిధ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రైళ్ల సమాచారం ఇలా..: అభివృద్ధి పనుల నేపథ్యంలో స్టేషను మీదుగా వెళ్లే పలు రైళ్లను శుక్రవారం నుంచి జనవరి 8 వరకు రద్దు చేయడంతోపాటు, దారి మళ్లించారు.
విశాఖపట్నం-విజయవాడ (02717), విజయవాడ-విశాఖపట్నం(02718) రైళ్లు ఈ నెల 25 నుంచి జనవరి 8 వరకు, విశాఖపట్నం-కడప(07488) ఈ నెల 25 నుంచి జనవరి 7 వరకు, కడప-విశాఖపట్నం(07487) ఈ నెల 26 నుంచి జనవరి 8 వరకు రద్దు చేశారు. అలాగే.. వారంలోని వివిధ రోజుల్లో రాకపోకలు సాగించే 18 ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు.
చంగల్‌పట్టు-కాకినాడ పోర్టు(07643) ఈ నెల 24 నుంచి జనవరి 7 వరకు, కాకినాడ పోర్టు-చంగల్‌పట్టు(07644) ఈ నెల 25 నుంచి జనవరి 8వరకు ఈ రైళ్లను భీమవరం-కాకినాడ పోర్టు మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. విశాఖపట్నం-విజయవాడ మార్గంలో నడిచే ఎనిమిది రైళ్లను విజయనగరం, రాయగడ మీదుగా దారి మళ్లించారు.
ఈ రైళ్లు యథావిధిగా..: భువనేశ్వర్-కె.ఎస్.ఆర్.బెంగళూరు (08463), కె.ఎస్.ఆర్.బెంగళూరు-భువనేశ్వర్( 086464), ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్(01019), భువనేశ్వర్-ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్01020) రైళ్లు యథావిధిగా నడవనున్నాయి.
సమాచారం అందించేందుకు ఏర్పాట్లు..
ప్రయాణికుల ప్రత్యేక రైళ్లకు ముందస్తు రిజర్వేషన్లు చేయించుకున్నవారికి ఉన్నతాధికారులు ఇప్పటికే సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు స్టేషనులో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు