రేపు అమ్మ ఒడి రెండో కార్యక్రమం
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి రెండో కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించనున్నారు. జిల్లా మంత్రులు, అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల కోడ్ అమలు లో ఉన్న నేపథ్యంలో ఎస్ఈసీ ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు వెళ్ళనున్నారు. అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరతారు. 11 గంటల 10 నిమిషాలకు నెల్లూరు చేరుకుంటారు. స్టాల్స్ సందర్శన అనంతరం అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభించి బహిరంగ సభ లో పాల్గొంటారు.దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా మంత్రులు, నాయకులు, అధికారులు పర్యవేక్షించారు. అనూహ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో ఎన్నికల కోడ అమల్లోకి వచ్చింది. అయితే ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాల్లోనే కోడ్ ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. రేపటి సీఎం కార్యక్రమం నెల్లూరు పట్టణంలో జరుగుతున్న నేపథ్యంలో కోడ్ వర్తిస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు అమలు చేసుకున్నా అభ్యంతరం లేదు అయితే రాజకీయ నాయకులు లేకుండా అధికారుల సమక్షంలో జరగాలి అని మరో నిబంధన కూడా నిమ్మగడ్డ పెట్టారు. అమ్మ ఒడి ఆర్థిక సహాయ కార్యక్రమం పట్టణ ప్రాంతంలో జరిగినా లబ్దిదారులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోనూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి