రుణయాప్ గుట్టుమట్లను రట్టుచేస్తున్నారు తెలంగాణ పోలీసులు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన రుణయాప్ గుట్టుమట్లను రట్టుచేస్తున్నారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ మహానగరంలోని మూడు కమిషనరేట్లు (హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ) పోలీసులు ఎవరికి వారు రుణయాప్ ఆరాచకాలపై ఫోకస్ చేయటం..ఈ దందాకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో కోణాన్ని ఆవిష్కరించటమే కాదు.. ఎవరికి వారు తమకున్న నెట్ వర్కు.. సమాచారంతో దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లి అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ కు చెందిన సైబర్ పోలీసులు ఢిల్లీలోని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.వారందరిలోకి కీలకం చైనాకు చెందిన లాంబో. ఇతగాడు నిర్వహిస్తున్న రుణ యాప్ వ్యాపార పరిధి గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు.
దాదాపు రూ.21వేల కోట్ల టర్నోవర్ చేసిన ఇతగాడి కంపెనీ మీద పోలీసులు ఫోకస్ చేయటమే కాదు.. లోతుల్లోకి వెళ్లారు. వీరికి సంబంధించిన కాల్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ సందర్భంగా లాంబో ప్రస్తావన వచ్చింది కానీ.. అతగాడు ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? అన్న విషయంపై క్లారిటీ మాత్రం రాలేదు. దీంతో.. ఇతడి ఆచూకీ కోసం పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.ఈ క్రమంలో ఈ కంపెనీకి చెందిన కేంద్ర కార్యాలయంలోని కీలక ఉద్యోగుల్ని ప్రశ్నించే సమయంలో పోలీసులకు కొత్త విషయం తెలిసింది. లాంబోతో కంపెనీకి చెందిన సీనియర్ స్థానంలో ఉన్న మహిళతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించటంతో ఆమె ఫోన్లో అతడి ఫోటోలు.. పాస్ పోర్టు వివరాలు ఉన్నాయి. వెంటనే అలెర్టు అయిన పోలీసులు.. ఆ వివరాల్ని దేశంలోని విమానాశ్రయాలకు పంపి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్న అతగాడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇలా వేలాది కోట్ల వ్యాపార దందాను చేసే లాంబో ఆటను తెలంగాణ పోలీసులు కట్టడి చేశారని చెప్పాలి.