మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంవద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో కొత్తగా 3 రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. అదనంగా 3.3 టీఎంసీల కెపాసిటీ పెంచాం. హంద్రినీవా ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ప్రభుత్వాలు కేవలం ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇచ్చాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాం కు నీరు తరలించేందుకు 803 కోట్లతో టీడీపీ అంచనాలు వేసింది. అదే డబ్బుతో మేము నాలుగు రిజర్వాయర్లు అదనంగా నిర్మించి పేరూరు డ్యాంకు నీరందిస్తున్నాం. 75,000 ఎకరాలకు సాగునీరు, చాలా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నాం. ప్రాజెక్టు కాస్ట్ పెంచకుండా ఎక్కువ లబ్ది చేకూరుస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ దోపిడీ చేసింది.
టీడీపీ పాలనలో లంచాలు ఏస్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది. పేరూరు డ్యాం, ఇతర నాలుగు రిజర్వాయర్ల పరిధిలోని 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో జనతా బజార్లు తెస్తాం. రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సీఎం జగన్‌కు రైతు ప్రయోజనాలే ముఖ్యం: తోపుదుర్తి
రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా నుంచి పేరూరుకు నీరిస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. పేరూరు డ్యాం సహా నాలుగు రిజర్వాయర్లకు నీరివ్వటం వల్ల మా ప్రాంతంలో కరవు పోతుంది. పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలి. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. సీఎం జగన్‌కు రైతు ప్రయోజనాలే ముఖ్యం. జగన్‌కు జిల్లా రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు’ అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా, రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు.