మార్చి లో కరోనా టీకా

తెలంగాణాలో మార్చి రెండో వారం నుండి కరోనా వైరస్ విరుగుడు వ్యాక్సినేషన్ వేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గడచిన నెలగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మార్చి 2వ వారం నుండి మామూలు జనాలకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ముందుగా 50 ఏళ్ళ వయస్సు పైబడిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఇదే సమయంలో 50 ఏళ్ళలోపు వయస్సున్న వారిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం రూపొందించిన కోవిన్ వెబ్ సైట్ ద్వారా పైన చెప్పిన రెండు క్యాటగిరీల్లోని వాళ్ళు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అలాకాకుండా మార్చి మొదటివారంలో కేంద్రం కోవిన్ మొబైల్ యాప్ ను కూడా విడుదల చేయబోతోంది. దీని ద్వారా కూడా పైన చెప్పిన క్యాటగిరీల వాళ్ళ తమ పేర్లను నమోదుచేసుకోవచ్చు.
ప్రభుత్వ అంచనా ప్రకారం పై రెండు క్యాటగిరిల్లో సుమారు 80 లక్షల మందికి టీకాలు వేయాల్సుంటుంది. వీరిలో 70 లక్షల మంది 50 ఏళ్ళ పైబడిన వాళ్ళున్నారు. అలాగే 4 లక్షల మంది 50 ఏళ్ళలోపు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళుంటారని ప్రభుత్వం అంచనా వేసింది. 74 లక్షల మందికి టీకాలు వేయటానికి కనీసం ఏడాది సమయం పడుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేసింది.
మొత్తం మీద తెలంగాణాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎంత మంది మరణించారనే విషయంలో మొదటి నుండి కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే కేసులు మరణాల విషయంలో ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పటం లేదని ఆరోపణలతో చాలామంది కోర్టుల్లో కేసులు కూడా వేశారు. హైకోర్టు జోక్యం చేసుకున్నా ఆదేశాలిచ్చినా ప్రభుత్వం మాత్రం కేసులు మరణాల విషయంలో తన దగ్గరున్న లెక్కలను మాత్రమే చెబుతోంది. తాము ఇంటింటికి తిరిగి ఎవరికీ పరీక్షలు చేయటం లేదని ప్రభుత్వం చాలా నెలల క్రితమే స్పష్టంగా చెప్పేసింది. దాంతో చేసేది లేక హైకోర్టు కూడా చేతులెత్తేసింది.