మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి
-సీఎం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు
-రాజ్యాంగాన్ని గౌరవించలేనప్పుడు రాజీనామా చేయాలి
-తెలుగు మహిళ కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి
కర్నూలు: రాష్ట్రంలో మహిళలపై రోజు రోజుకు దాడులు,
అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని వారి రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని
తెలుగు మహిళా కర్నూలు పార్లమెంటు ప్రధానకార్యదర్శి సుకన్యదేవి అన్నారు. శనివారం
ఆమె విలేకరులతో మాట్లాడారు. పత్తికొండ మండలం పందికోనలో అధికార పార్టీకి చెందిన
కాశి అనే కార్యకర్త ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో మహిళలకే కాకుండా యువతులు, చిన్నారులకు కూడా రక్షణ లేకుండా
పోతుందని ఆమె వాపోయారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా దిశా చట్టం
తీసుకువచ్చిందని కాని ఆచరణలో చట్టం అమలుకు నోచుకోకపోవడంతో మహిళలపై రోజు రోజుకు దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఏ చిన్న కష్టం వచ్చినా గన్‌లో బులెట్ రావడం ఆలస్యం అవుతుందేమోగాని,
జగన్ రావడం మాత్రం ఆలస్యం కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రగల్భాలు పలికారని గుర్తు
చేశారు. రాష్ట్రంలో రోజు ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే రోజా ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.ఈ ప్రభుత్వంలో ప్రకటనలు తప్ప ఆచరణలో ఏది
కార్యరూపం దాల్చడం లేదని ఆరోపించారు. మరోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయితీ
ఎన్నికల నిర్వహణకు ముందుకు వస్తే జగన్ వెనక్కు వెళ్ళడం విచిత్రంగా ఉందన్నారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని గొప్పలు
చెప్పుకునే జగన్ ఇప్పుడు ఎన్నికలకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
ఎస్‌ఈసీ ఎన్నికలు జరిపేందుకు ముందుకు వస్తే ఎన్నికలు ఆపేందుకు హైకోర్టుకు వెళ్ళడం,
హైకోర్టు కూడా ఎన్నికలు జరపాలని చెబితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఆయనలో ఓటమి
తాలుకు భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు
సీఎం, ఆ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని అన్నారు. హైకోర్టు చెప్పినా ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాకపోవడం విచిత్రంగా
ఉందన్నారు. మరోపక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్యోగులు సహకరించరని ప్రకటించడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుండడం దారుణమని, ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే నైతిక అర్హత వీరికి లేదని తక్షణమే సీఎం, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క కొంతమంది ఉద్యోగులు కూడా జగన్ మెప్పు పొందేందుకు ఎన్నికల నిర్వహణ
కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టలేమని చెప్పి ఎన్నికల వాయిదా కోసం ప్రయత్నించడం దారుణమన్నారు. ఒకపక్క విద్యార్థులు స్కూళ్ళకు రమ్మని చెప్పి స్కూళ్ళు నిర్వహిస్తున్న
ప్రభుత్వం వాళ్ళకు కరోనా సోకితే ప్రాణాలు పోవా..? మీ ఒక్కటే ప్రాణాలా…? పిల్లలవి
ప్రాణాలు కాదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మహిళల రక్షణ కోసం
ప్రత్యేక చట్టాలు తీసుకురావడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగేలా సహకరించాలని సూచించారు.