మరో ఐదు రోజుల్లో ఎన్‌డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థ్ధిని ప్రకటిస్తామని బీజేపీ నేత ఖుష్బూ స్పష్టం
చెన్నై : మరో ఐదు రోజుల్లో ఎన్‌డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థ్ధిని ప్రకటిస్తామని బీజేపీ నేత ఖుష్బూ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ తదితర పార్టీలు ఉన్నా, సీఎం అభ్యర్ధిని బీజేపీయే ప్రకటిస్తుందని ఆది నుంచే చెబుతున్నామన్నారు. ఇందుకు అన్నాడీఎంకే సీనియర్ నేతలు కూడా అంగీకరించారని, ఈ విషయం మర్చిపోయి ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికల విషయంలో స్వంత నిర్ణయాలు ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్ర ఎన్నికల వ్యవహారాన్ని బీజేపీ అధిష్ఠానం నిత్యం పరిశీలిస్తోందని, మరో ఐదు రోజుల్లో సీఎం అభ్యర్థ్ధిని ప్రకటిస్తామన్నారు.స్థానిక పుదుపేటలో ప్రచారం సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఖుష్బూ మాట్లాడుతూ. కూటమిలో పెద్ద పార్టీగా వున్న అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని తమ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సీటీ రవి ఇటీవలే స్పష్టం చేశారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. బీజేపీకి భయపడే రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోగలిగిన వ్యక్తి రజనీ అని, ఆరోగ్యం బాగా లేనందునే రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించాక కూడా ఇలాంటి పుకార్లు పుట్టించడం సరికాదన్నారు.