బీసీల పేరు చెప్పుకుని రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్నారు
అనంతపురం పార్లమెంటు ఇంచార్జ్ జేసీ పవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గజదొంగ లాగా రాత్రి సమయంలో ఇంటికి వెళ్లి కళా వెంకట్రావును అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే సౌమ్యుడు అయిన కళా వెంకట్రావుపై కేసు పెడుతారా.. ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలను జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. బీసీల పేరు చెప్పుకుని రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇకనైనా బీసీలపై కక్ష్య సాధింపులు ఆపాలన్నారు. ప్రతి రంగంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 30 సంవత్సరాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యం కావాలంటే చెప్పండి…మేము తప్పుకుంటామని పవన్ రెడ్డి అన్నారు.వైసీపీ మంత్రులకు తిట్టడం తప్ప వేరే పని లేదని పవన్ రెడ్డి అన్నారు. దేవినేని ఉమను కూడా పోలీసులు స్టేషన్ల చుట్టూ తిప్పారని, ప్రజా వేదిక విధ్వంసంతో రాష్ట్రంలో పాలన మొదలు పెట్టారని విమర్శించారు. కోర్టు తీర్పుతో చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం వుంటే ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. స్ధానిక సంస్థలకు ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం జగన్ ఎన్నికలకు భయపడుతున్నారని పవన్ రెడ్డి విమర్శించారు.