పులివెందుల మెగా టౌన్ షిప్ లే ఔట్ కాలనీలో 8,042 మందికి ఇంటి స్థలాలు, ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

పులివెందుల మెగా టౌన్ షిప్ లే ఔట్ కాలనీలో 8,042 మందికి ఇంటి స్థలాలు, ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
147.70 కోట్ల రూపాయలతో మెగా హౌసింగ్ కాలనీలో రోడ్లు , డ్రైనేజి వ్యవస్థ, త్రాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పన
పులివెందుల మన జనప్రగతి డిసెంబర్ 24 :-
ప్రగతి పతాకాలతో రెపరెపలాడుతున్న పులివెందుల సొంతగడ్డను, వైయస్.ఆర్ జగన్నన్న హౌసింగ్ లే – అవుట్ ను హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ చూస్తూ ఉంటే గర్వంగా వుంది. తన మీద మీకున్న అభిమానం, ప్రేమ, మమకారం, ఆప్యాయతల మధ్య 8,042 మందికి 353 ఎకరాల విస్తీర్ణములో ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు మంజూరు పత్రాల పంపిణి చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని మెగా టౌన్ షిప్ లే ఔట్ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్సాహంగా మాట్లాడుతూ పేదలందరికి ఇళ్ళు పధకం కింద పులివెందుల పట్టణములో ఇంటి స్థలము మరియు గృహవసతి కోసం ఎదురుచూస్తున్న 8 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. హౌసింగ్ లే – అవుట్ ను ప్రజలకు సౌకర్యవంతముగా మరియు ఆహ్లాదకరముగా అభివృద్ధి పరిచేందుకు మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా 147.70 కోట్ల రూపాయలతో రోడ్లు , డ్రైనేజి వ్యవస్థ మరియు త్రాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఈ కాలనీ నందు ఏడు వార్డు సచివాలయాలు, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఏడు ప్రాథమిక పాఠశాలలు,ఆట స్థలము,పోలీస్ స్టేషన్ , పోస్ట్ ఆఫీస్, రెండు పార్కులు తదితర వసతులు కల్పించడం ద్వారా ఆదర్శవంతమైన హౌసింగ్ లే – అవుట్ గా తీర్చిదిద్దటం జరుగుతుందని సీఎం తెలిపారు. ఒక్కో ఇంటి పట్టా విలువ 2 లక్షలు, ఇంటి నిర్మాణానికి 2 లక్షలు, కాలనీలో 147.70 కోట్ల రూపాయలతో మౌళిక సదుపాయాల కల్పనతో అన్ని పనులు పూర్తయితే సగటున ఇంటి విలువ కనీసం 10 లక్షల రూపాయలు అవుతుందని సీఎం తెలిపారు.
అలాగే లే – అవుట్ కు అతిసమీపంలో గల పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ నందు ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు రెండు వేల మంది మహిళలకు ఉపాధి లభించనుందన్నారు.
ఇదివరకే శంఖుస్థాపన చేసిన అపాచి పరిశ్రమ త్వరలో ప్రారంభమవుతుండడంతో అదనంగా మరో రెండు వేల మందికి ఉపాధి కల్పించడం ద్వారా మీ జీవన ప్రమాణాలు మెరుగు పరిచే విధముగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అలాగే పులివెందుల మార్కెట్ యార్డ్ నందు 10 కోట్ల 50 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా చీనీ రైతుల సౌకర్యార్థం 4 కోట్ల 79 లక్షల రూపాయలతో 6 వేల టన్నుల చీనీ ని నిల్వ చేసేందుకు చీనీ షెడ్ ను నిర్మించడం జరిగింది. అంతేకాకుండా పులివెందుల మరియు పరిసర ప్రాంత వాసులకు చేపలు,రొయ్యలు మొదలగు మత్స్య సంపదను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆక్వా హబ్ ప్రారంభించాం. అదేవిధముగా 50 ANDHRA FISH_KIOSK లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామ ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. 500 కోట్లతో డా. వైయస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేపట్టామని పనులు శరవేగంగా జరుగుతున్నాయని 2023 నాటికి పూర్తి చేస్తామని సీఎం వివరించారు. అలాగే 34.20 కోట్లతో నూతన బస్ డిపో, బస్ స్టేషన్ల నిర్మాణ పనులు 2022 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. 12.96 కోట్లతో పులివెందుల శిల్పారామం ఆధునీకరణ పనులు 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తాం. 17.50 కోట్లతో పులివెందుల క్రీడామైదానం పనులు 2022 జులై నాటికి, 44.99 కోట్లతో ఉలిమెల్ల సరస్సు అభివృద్ధి పనులు 2022 డిసెంబర్ నాటికి, 100 కోట్లతో పులివెందుల యుజిబి నిర్మాణ పనులు 2022 జులై నాటికి పూర్తవుతాయి
అలాగే 65 కోట్లతో పులివెందుల సమగ్ర నీటి సరఫరా పథక పనులు 2022 మే నాటికి, .10.59 కోట్లతో జూనియర్ కళాశాల యందు అదనపు తరగతి గదుల పనులు 2022 మే నాటికి పూర్తవుతాయి. 1.20 కోట్లతో ఫైర్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయిందన్నారు.
20.70 కోట్లతో పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ అభివృద్ధి పనులు 2023 మే నాటికి, 9.23 కోట్లతో మండలానికి ఒకటి చొప్పున ఎనిమిది మార్కెటింగ్ గిడ్డంగులు 2022 మే నాటికి, 13 కోట్లతో అరటి రైతుల కోసం శీతల గిడ్డంగి నిర్మాణ పనులు 2022 డిసెంబర్ నాటికి, 20 కోట్లతో ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్ఆర్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి పనులు 2022 మే నాటికి, 92 కోట్లతో వేంపల్లి యూజీడీ నిర్మాణ పనులు 2023 మే నాటికి పూర్తవుతాయని సీఎం తెలిపారు. అదేవిధంగా
20 కోట్లతో వేంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులు 2023 జూన్ నాటికి, 14.50 కోట్లతో గండి వీర ఆంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు 2023 జూన్ నాటికి, 14.80 కోట్లతో వేంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణ పనులు 2022 ఏప్రిల్ నాటికి, 9.97 కోట్లతో వేంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో అదనపు తరగతి గదుల పనులు 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.4.56 కోట్లతో వేంపల్లి ఉర్దూ జూనియర్ కళాశాల పనులు 2022 జూన్ నాటికి, 14 కోట్లతో సింహాద్రిపురం డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం,4.57 కోట్లతో సింహాద్రిపురం పాలిటెక్నిక్ కళాశాలలో అదనపు తరగతి గదుల పనులు 2022 ఏప్రిల్ నాటికి పూర్తవుతాయన్నారు.
480 కోట్లతో పులివెందుల నియోజకవర్గం లో వాటర్ గ్రిడ్ పనులు 2022 జూన్ నాటికి, 5036 కోట్లతో పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయకట్టును స్థిరీకరించేందుకు జిఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుండి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటి ఎత్తిపోతల పథక పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయని సీఎం తెలిపారు. 1113 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రబెల్లి చెరువుకు నీటిని నింపడం ద్వారా వేంపల్లి మండలంలోని 7 గ్రామాలకు నీటిని సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు 2023 ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి.
3015 కోట్లతో గండికోట నుండి 40 రోజులలో చిత్రావతి మరియు పైడిపాలెం జలాశయాలను నింపేందుకు నూతన లిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు, 1256 కోట్లతో పిబిఎల్, జికేఎల్ ఐ, సీబీఆర్ కుడి కాలువ పరిధిలో లక్ష 22 వేల ఎకరాలను సూక్ష్మ నీటి పరిధిలోకి తీసుకువచ్చే పనులకు సంబంధించి భూసేకరణ ఈ విషయంలో రైతుల నుండి సహాయ సహకారాలు అందజేయాలని కోరుతున్నాను. 56.83 కోట్లతో వేముల, వేంపల్లి మండలాల్లోని గ్రామాలకు ఆయకట్టు స్థిరీకరణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని సీఎం వివరించారు.
న్యాయపరమైన చిక్కులు తొలగించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నాం – కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయపరమైన చిక్కులు తొలగించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది క్రిస్మస్ పర్వదినాన్ని రాష్ట్రమంతా ఇంటి పట్టాల కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆ రోజు రాష్ట్రమంతా సంతోషంగా ఉంటే పులివెందులలో మాత్రం న్యాయపరమైన చిక్కులు వల్ల పట్టాలను పంపిణీ చేయలేకపోయామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేదన చెందారన్నారు. న్యాయపరమైన చిక్కులు అన్నింటినీ తొలగించి 323 ఎకరాలలో 8042 పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అందులో మెగా టౌన్షిప్ లేఅవుట్ లో 7309 మందికి,బ్రాహ్మణపల్లి దగ్గర 733 మందికి పట్టాలతో పాటు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా అందిస్తున్నామన్నారు. ప్రతి ప్లాట్ కు రెండు లక్షల రూపాయలు,ఇంటి నిర్మాణానికి రూ1,80,000/-లు, మౌలిక వసతులకు మరో రెండు లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు.ఇందుకోసం147 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. పేదలందరికీ ఇళ్ళు మంజూరు చేసే కార్యక్రమం సీఎం కు ఎంతో తృప్తిని ఇచ్చే కార్యక్రమమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు
-రెవిన్యూ శాఖా మాత్యులు ధర్మాన కృష్ణ దాస్
రెవిన్యూ శాఖా మాత్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. ప్రతిపక్షాల వలన నిలిచిపోయిన ఈ కార్యక్రమం న్యాయ పరమైన చిక్కులనుతొలగించి నేడు తిరిగిమంజూరుచేయడం జరుగుతోందన్నారు. పేదలందరికీ ఇల్లు ఒక సామాజిక భద్రతను ఇచ్చే కార్యక్రమమన్నారు.నాటి పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు మంజూరు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆదిశగా అడుగులు వేస్తూ పాలనలో ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు.
ఇళ్ల నిర్మాణాలలో దేశంలోనే రాష్ట్రానికి ప్రథమ స్థానం
– గృహనిర్మాణ శాఖామాత్యులుసిహెచ్ రంగనాథ రాజు
రాష్ట్ర గృహనిర్మాణ శాఖామాత్యులు సి హెచ్ రంగనాథరాజు మాట్లాడుతూ,ఇళ్ల నిర్మాణాలలో దేశంలోనే రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందన్నారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 24 లక్షల ఇళ్లను నిర్మించారని,నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్లనుమంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం నాలుగు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు. ఈనెల 21వ తేదీన జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద 52 లక్షల మంది లబ్ధిదారులకు 8 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తిని అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 17,500 నగరాలలో లేఅవుట్లు నిర్మిస్తున్నామన్నారు.
నేటి నుంచే ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తాం
– జిల్లా కలెక్టరు వి.విజయరామరాజు
జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు మాట్లాడుతూ పులివెందల మెగా టౌన్షిప్ లేఅవుట్లో నేటి నుండే లబ్ధిదారులకు చెందిన ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ లే అవుట్ ను 323 ఎకరాలలో ఏర్పాటు చేశామని, 7323 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసి వారి సొంత ఇంటి కలను నెరవేర్చడం జరుగుతోందన్నారు. ఈ లే అవుట్లలో మౌలిక వసతులన్నింటినీ కల్పించడం జరుగుతుందన్నారు. పులివెందలలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల వలన లబ్ధిదారులకు ఇళ్ల సమీప ప్రాంతం నుండి నడుచు కుంటూ వెళ్లి ఉద్యోగం చేసేఅవకాశం ముఖ్యమంత్రి కల్పించారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖ మంత్రి డా. అప్పలరాజు, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, రమేష్ యాదవ్ లు, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎం గౌతమి, పాడ ఓ ఎస్ డి అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.