పరిహారం కోసం అధికారుల నిర్బంధం-పోలీసులు చొరవతో విడుదల
యల్లనూరు, డిసెంబరు 21, పప్పుశనిగ పంట నష్టపోయామన్న ఏ అధికారి స్పందిచకపోవడంతో అసహనానికి గురైన పాతపల్లి గ్రామ రైతులు సోమవారం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఏడి చెంగల రాయుడు, ఏఓ కాత్యాయని, సిబ్బందిని కార్యాలయం తలుపులు వేసి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులను విడిపించారు. వివరాల్లోకి వెళితే ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలో రైతులు సాగుచేసిన పప్పు శనిగ పంట పూర్తిగా దెబ్బతింది. పాతపల్లి గ్రామం తో పాటు జంగంపల్లి గ్రామ రైతులు కూడా నష్టపోయారు. పక్క జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.8వేల పరిహారం ప్రభుత్వం అందజేసిందని కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పంట పొలాలు కూడా తుఫాను దెబ్బకు నష్టపోయాయని తమకు పరిహారం అందించి ఆదుకోవాలంటూ రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించారు. ఇటీవల మండల పర్యటనకు వచ్చిన విద్యా సంస్కరణలు కమిటీ చైర్మన్ ఆలూరు సాంబశివారెడ్డికి కూడా రైతులు తమ సమస్యలను వివరంచినప్పటికీ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. దీంతో సోమవారం గ్రామానికి వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రం లో ఉండగా రైతులు అక్కడికి చేరుకొని తమకు పంట నష్టపరిహారం అందించాలని విన్నవించారు. ఈ క్రమంలో అధికారులకు రైతులకు మధ్య మాటా మాటా పెరగడంతో అసహనానికి లోనైనా రైతులు అధికారులను లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేసి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటప్రసాద్ అక్కడికి చేరుకుని కార్యాలయం తలుపులు తెరిచి అధికారులతో, రైతులతో పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం వారి ఇరువురిని స్టేషన్ కు పిలిపించి చర్చించారు. ఫిర్యాదు చేస్తే రైతులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ అధికారులకు సూచించగా అన్నం పెట్టే రైతన్నలపై తాము ఫిర్యాదు చేయమంటూ వ్యవసాయ అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు.