నేడు క్రిస్మస్ పండుగ మరియు వైకుంఠ ఏకాదశి పండుగ కలిసి రావడం ఎంతో శుభదిన రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి
పులివెందల డిసెంబర్ 25: క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మూడురోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఇడుపులపాయ నుంచి ఉదయం 8.45గం.లకు బయలుదేరి పులివెందులలోని స్థానిక భాకరాపురం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు ఉదయం 9.05గం.లకు చేరుకున్నారు.
అక్కడ నుంచి బయలుదేరి 9.15గం.లకు పులివెందులలోని సీఎస్ఐ చర్చికి చేరుకొని తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వై ఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన కూటమిలో సీఎం పాల్గొన్నారు.
పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటి సీఎం ఎస్.బి.అంజద్ భాష, జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, జేసిలు ఎం. గౌతమి, పి.ధర్మచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకెపాటి అమరనాధ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పి అన్బురాజన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.*
ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సీఎస్ఐ చర్చిలో తల్లి విజయమ్మతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ కేకు కట్ చేశారు. అలాగే చర్చి వారి ఆధ్వర్యంలో.. నూతన సంవత్సర క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ప్రార్థన కూటములు ముగిసిన అనంతరం చర్చిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… నేడు క్రిస్మస్ పండుగ మరియు వైకుంఠ ఏకాదశి పండుగ కలిసి రావడం ఎంతో శుభదినం అన్నారు. ఇంత మంచి రోజున రాష్ట్ర వ్యాప్తంగా నేడు 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నా… మనసులో ఎక్కడో చిన్న బాధ ఉందని.. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నా పులివెందులలో మాత్రం ఈ కార్యక్రమం చేయలేకపోతున్నామని… దాదాపు ఎనిమిది వేల మూడు వందల ఇళ్ల పట్టాలు సిద్ధంగా ఉన్నా… మంచి చేయడం గిట్టనివారు కోర్టుకు వెళ్లడం మూలంగా పులివెందులలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందన్నారు. ఏపీఐఐసీ భూములలో ఇళ్ల పట్టాలు ఇస్తే ప్రజలకు నష్టం జరుగుతుందని కోర్టుకు వెళ్లారని, అయితే ఏపీఐఐసీ భూములు ప్రభుత్వానివే… ఏపీఐఐసీకి భూములు ఇచ్చేది కూడా ప్రభుత్వమే. ఇంత మంచి కార్యక్రమం వాయిదా పడినందుకు మనసుకు కొంత బాధ కలిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. మూడు లక్షల వరకు వివిధ కారణాలతో కోర్టులో పెండింగ్ పడడం జరిగిందన్నారు. కోర్టులలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్లి మిగిలిన మూడు లక్షల ఇళ్ల పట్టాలను కూడా త్వరలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ ఏసుప్రభువు మరియు ఆ భగవంతుని కృప వల్ల రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని.. ప్రజలందరికీ మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నానని.. ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ పండుగ మరియు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.అనంతరం పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్ధనా కూటములు ముగించుకొని ఉదయం 10.30గం.లకు భాకరపురం హెలిప్యాడ్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు .