నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి
కడప:-పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న పోలీస్ అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం రాయచోటి లో జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ రెండవ విడత లో జరిగే పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్ మాట్లాడుతూ.. రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో బాగంగా 13 వ తేదీ ఉదయం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సమయస్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. క్యూ లైన్లను క్రమ పద్ధతిలో పాటించే విధంగా మరియు ఓటర్ల సమూహం బట్టి మహిళల కొరకు ప్రత్యేకంగా వరుస క్రమంలో పంపించాలని సూచించారుమంచినీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు,బాల్ పెన్నులు మరియు మొబైల్ ఫోన్లు మొదలైన వాటిని అనుమతించకూడదని తెలిపారు. 100 మీటర్ల లోపు జన సమూహం లేకుండా చూసుకోవాలని, బ్యానర్స్ మరియు ఎటువంటి ప్రచారాలకు అనుమతి లేకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు, ముఖ్యంగా మహిళలు,వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగేటట్లు సిబ్బంది చూడాలని సూచించారు