దేశవ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలు
దేశవ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలు
పాలకమండలి నిర్ణయాలు వెల్లడించిన తితిదే ఛైర్మన్
తిరుమల: శ్రీవారి ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా 500 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే పాలక మండలి సమావేశం అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. వచ్చే 18 నెలల్లోనే కశ్మీర్‌లో స్వామివారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వారణాసి, బాంబేలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తితిదే పరిధిలో ఉన్న ప్రతి ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని విస్తురిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 100 ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.
‘‘ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో నిరంతరాయంగా స్వామివారిని నైవేద్యం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన రైతులతో మాట్లాడి సహజ పంటలపై త్వరలోనే చర్చిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని అన్ని విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు వీలుగా ఒక నూతన విధానాన్ని తీసుకురాబోతున్నాం. వచ్చే 90 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక ముసాయిదా రూపొందిస్తాం. ఇప్పటికే వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఈ ఉద్యోగుల సర్వీస్, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని వారిని రెగ్యులర్ చేసేందుకు గల అన్ని అవకాశాలను పరిశీలిస్తాం. అవకాశం ఉన్న ప్రతి ఉద్యోగిని తితిదే పరిధిలో శాశ్వత ప్రాతిపదికన నియమిస్తాం’’ అని సుబ్బారెడ్డి తెలిపారు.