దారుణం .. కర్నూలులో 6ఏళ్ళ బాలికపై 50ఏళ్ళ వ్యక్తి అత్యాచారం

మహిళలు బాలికల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, కామాంధులు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. అన్యం పుణ్యం తెలియని పసిమొగ్గల జీవితాలను తమ కామవాంఛ తీర్చుకోవడానికి బలి చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి దిశ వంటి చట్టాలను తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. అయినప్పటికీ ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడా దారుణ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.తాజాగా కర్నూలులో అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఒక 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అత్యాచారం చేశాడు. కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కొన్ని రోజులుగా బాలిక నీరసంగా ఉండటంతో గమనించిన తల్లిదండ్రులు బాలికను కూర్చోబెట్టి ఏమైందో చెప్పమని అడగగా, బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాలికల సంరక్షణ కోసం కఠినమైన చట్టాలు ఉన్నా, ప్రభుత్వాలు ఇలాంటి నేరాల కట్టడికి ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఎలాంటి భయం లేకుండా కామాంధులు నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవలనే డిజిపి ఆఫీసుకు, పోలీస్ హెడ్ క్వార్టర్ కు, సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే ఒక యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రతిపక్ష నాయకులు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ వైఫల్యాలపై మండి పడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలకు బాలికలకు రక్షణ లేదన్న విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూనే ఉన్నాయి