తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత

తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. అయితే, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు పెట్టి పౌరులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీంతో చాలా వరకూ కేసులు తగ్గాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేసే విషయమై ప్రభుత్వం వైద్యశాఖ అధికారులతో చర్చించింది. రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేసి ఒక నివేదిక ఇవ్వమని కోరింది. వైద్యశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ ఎప్పటిలాగే నడుస్తాయి. లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి రానుంది.ఇక అంతర్రాష్ట్ర ప్రయాణాలు, బస్సు సర్వీసుల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అదే విధంగా పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు తెరిచే విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.