తెలంగాణలోని యాదవులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త
హైదరాబాద్ మన జనప్రగతి న్యూస్ :- తెలంగాణలోని యాదవులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని గొల్ల,కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 16న నల్లగొండలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు గొల్ల, కురుమల తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 8,109 గొర్రెల పెంపకం దారుల సొసైటీ లు ఉండగా, వీటిలో 7,61,895 మంది సభ్యులుగా ఉన్నారని, వీరందరికీ 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అన్నారు.రెండు విడతలలో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు 2017 వ సంవత్సరంలో ప్రారంభించి మొదటి విడతలో 3,66,373 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇందుకోసం 4,579 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెల తో 2017-18 లో 20.75 లక్షలు, 2018-19 లో 39.94 లక్షలు, 2019-20 లో 39.28 లక్షలు, 2020-21 లో 37.12 లక్షల గొర్రెల సంపదను సృష్టించడం జరిగిందని వివరించారు. నూతనంగా పుట్టిన ఒక కోటి 37 లక్షల గొర్రె పిల్లల విలువ 6,169 కోట్ల రూపాయలు అని తెలిపారు.. రాష్ట్రంలో డీడీలు చెల్లించిన 28,335 మందికి గొర్రెల పంపిణీ చేస్తామని స్పష్టం చేసారు. ఇందుకోసం 360 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన 4,210 కోట్ల రూపాయలను వచ్చే బడ్జెట్ లో కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని గొల్ల, కుర్మల ఆఖరి కుటుంబం వరకు గొర్రెలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.