తమకు రక్షణ కల్పించండి….

తమకు రక్షణ కల్పించండి….
కడప ఫిబ్రవరి 04:-బ్రహ్మంగారిమఠం మండలం దిగువ నేలటూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న తన తల్లి మన్యం ఆదిలక్ష్మమ్మ, తనకు రక్షణ కల్పించాలని మన్యం నాగేశ్వర్ రెడ్డి కోరారు. గురువారం సానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగువ నేలటూరు పంచాయతీకి వైసిపి మద్దతుతో తన తల్లి నామినేషన్ వేసింది అని పేర్కొన్నారు. జడ్పిటిసి అభ్యర్థి రామ గోవిందరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఫోన్లో బెదిరిస్తున్నారని తెలిపారు . ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీ ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎస్ ఈ సి దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. రామ గోవిందరెడ్డి టిడిపిలో ఉండి తనపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. ఇప్పుడు వైసీపీ లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమను బెదిరించాలని చూడడం దారుణం అన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే అండతో మరో అభ్యర్థి చేత నామినేషన్ వేయించారని తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించామని ఆయన అందుబాటులో లేరని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు పోతామని పేర్కొన్నారు. జడ్పిటిసి అభ్యర్థి రామ గోవింద రెడ్డి గతంలో టిడిపి లో ఉన్న సమయంలో తాను హైదరాబాదులో ఉన్న కూడా ఊరిలో చోటుచేసుకున్న ఘర్షణను తమ పై అక్రమ కేసులు బనాయించి జైలుకు కూడా పంపించారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ బూత్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సజావుగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో ఆదిరెడ్డి. పవన్ కుమార్ రెడ్డి, సంపత్, మునెయ్య తదితరులు పాల్గొన్నారు.