
మన జనప్రగతి న్యూస్:- రైతు సమస్యలపై ఆందోళనలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ కాంగ్రెస్. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. కేంద్ర రైతు చట్టాలు.. టీఆర్ఎస్,బీజేపీ ప్రభుత్వాల వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసనగా శనివారం నుంచి మూడురోజుల పాటు ఆందోళనలకు సిద్దమైంది కాంగ్రెస్. శనివారం హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర రైతు దీక్ష చేయనుంది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈ దీక్ష చేస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4వరకు జరగనున్నఈ దీక్షలో పార్టీ ముఖ్యనేతలతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.రైతులకు మద్దతుగా జనవరి 10న పీసీసీ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాభవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది పార్టీ.రైతు చట్టాలు, వ్యవసాయ విధానాలపై కేసీఆర్ యూటర్న్ అనే అంశాలపై సమావేశం కానుంది. జనవరి 11న డీసీసీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. ఈ మూడు కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.