టీఆర్‌ఎస్‌పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. అయితే విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలను సోషల్ మీడియా ద్వారా రాములమ్మ తప్పుబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై విజయశాంతి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శలు సంధిస్తూ వస్తున్నారు.దేవుళ్ళకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం టీఆర్‌ఎస్ నేతలకే చెల్లు. దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరచి అయోధ్య రాముడు… తెలంగాణ రాముడంటూ భేదభావాన్ని సృష్టిస్తున్నారు. అది చాలక అయోధ్య రామాలయానికి విరాళాలివ్వద్దని తమ ద్వేష మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు.పైగా విరాళాన్ని భిక్షం అంటూ ఆరాధ్య భావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి తేడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారు. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా… అంటున్న ఆ టీఆర్‌ఎస్ నేత…. ఇళ్లలోనే పూజా మందిరాలు ఉన్నప్పుడు గుళ్లకు…పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం దేనికో…. చెప్పాలి. ఇలా తలతిక్కగా మాట్లాడి అహంకారాన్ని ప్రదర్శించే టీఆర్‌ఎస్ నేతలను ప్రజలు తప్పక ఇళ్లకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలి” అని విజయశాంతి హెచ్చరించారు. అంతేకాదు ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో జై శ్రీరాం అంటూ ముగించారు.
”