టీఆర్ఎస్‌లో చేరి మోసపోయా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు
పరిగి: టీఆర్ఎస్ పార్టీ, ఆపార్టీ అధినేత కేసీఆర్‌పై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్‌లో చేరి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పరిగిలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణకు పీవీ ఏమీ చేయలేదని చెప్పిన కేసీఆర్, పీవీ అంత్యక్రియలకు కూడా వెళ్ళని కేసీఆర్‌కు ఇప్పుడు ఆయన కుటుంబంపై ప్రేమ పుట్టిందని విమర్శించారు. మంత్రులకు అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్.. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు రెండు సార్లు అవకాశమిచ్చారన్నారు. దిగజారుడు, లోపాయికారి రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట అని ధ్వజమెత్తారు. నాగేశ్వరరావును నడి బజారులో నిలబెట్టారని విమర్శించారు.నలభై మంది స్వతంత్ర అభ్యర్ధులను కావాలనే కేసీఆర్ బరిలో నిలిపారని ఆరోపించారు. పీవీ ఘాట్ కూల్చేస్తామన్న ఎంఐఎంతో పొత్తు ఉన్న టీఆర్‌ఎస్‌కు ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జి. చిన్నారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం మొదట బీజం వేసిన వ్యక్తి చిన్నారెడ్డి అని గుర్తు చేశారు.