జిల్లాలోని 806 గ్రామ పంచాయతీలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు
కడప జనవరి మన జనప్రగతి 27: జిల్లాలో నిష్పక్షపాతంగా.. ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరగాలని… ఇందుకు ఎన్నికల విధులను చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా నిర్వర్తించి పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నుండి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు ఆర్డిఓ, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎస్డీపిఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కూడా తన కార్యాలయం నుంచి ఈ వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలోని 806 గ్రామ పంచాయతీలలో 8033 పోలింగ్ కేంద్రాలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు మూడు నియోజకవర్గాలలోని 206 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయని, ఈ నెల 29న ఉదయం 10.30 నుండి మొదటి దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలపై నేటి ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని… ఎన్నికల మోడల్ కోడ్ ను ఖచ్చితంగా అమలుపరచాలన్నారు. ఎల్లుండి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతున్న దృష్ట్యా… మనకు ఎక్కువ సమయం లేదు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ముగిసినప్పటి నుంచే… తాసిల్దార్, లు ఎంపీడీవోలు, ఎస్డీపిఓలు ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకోవాలన్నారు. నామినేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి. పంచాయతీ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, డివిజన్, జిల్లా స్థాయి అధికారులందరూ సమన్వయంతో ఎన్నికలను విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈనెల 29 నుండి 31 వరకు నామినేషన్ల స్వీకరణ అనంతరం నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, విథ్వెల్స్ ప్రక్రియలను పకడ్బందీగా పూర్తిచేసి పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను పబ్లిష్ చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని, అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఎన్నికల దృష్ట్యా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఖచ్చితంగా పాటించాలని స్పష్టంగా ఆదేశించారు. ఎక్కడ కూడా మోడల్ కోడ్ ఉల్లంఘన జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలలో, బహిరంగ ప్రదేశాలలో రాజకీయ నాయకుల ఫోటోలు, ఫ్లెక్సీలు, పార్టీల జండాలు తొలగించాలని, విగ్రహాలు కవర్ చేయాలని, ప్రలోభపెట్టే విధంగా ఉన్న వాటిని అన్నింటిని తొలగించాలని, కోడ్ అమలులో ఉంది కాబట్టి రాజకీయ నాయకులతో సమావేశాలు ఉండరాదని సూచించారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. నగర కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఎన్నికలు లేకపోయినా మున్సిపల్ కమిషనర్లు మోడల్ కోడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన మోడల్ కోడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసేవరకు ఎంపీడీవోలు తహసీల్దార్లు ప్రధాన కేంద్రంలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ఎన్నికలకు అవసరమైన మెటీరియల్ అంతా కూడా సిద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిన్న,మధ్య, పెద్ద తరహా బ్యాలెట్ బాక్సులు అవసరమైనన్ని ఉన్నాయని, డివిజన్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఒక బ్యాలెట్ బాక్స్ లో ఎన్ని బ్యాలెట్ పేపర్లు పడుతున్నాయో ట్రయిల్ రన్ చేసుకొని అవసరం మేరకు బ్యాలెట్ బాక్సులు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి: కోవిడ్ నేపథ్యంలో… పోలింగ్ స్టేషన్ బయట మార్కింగ్ ఇవ్వాలని, ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రతి పోలింగ్ కేంద్రంలో శానిటైజర్, మాస్క్, చేతి గ్లౌజు, ఫేస్ షీల్డ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి శుక్రవారం(28న) కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన వివిధ అంశాలలో పలు సూచనలు జారీ చేశారు.పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్.పి కేకేఎన్.అన్బురాజన్. జిల్లాలో జరగనున్న పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలీసు శాఖ ద్వారా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని… మోడల్ కోడ్ ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పార్టీలు కూడా మోడల్ కోడ్ ను తప్పనిసరిగా పాటించాలని, ఇందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 21 చెక్పోస్టులు ఉన్నాయని, ఈరోజు నుండే వెపన్స్ హ్యాండోవర్ చేసుకోవడం మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసుఅధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్హెచ్ఓ, ఎంపీడీవోలు సంయుక్తంగా మనలను ఆటో ద్వారా మైకు లతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. మోడల్ కోడ్ అమలులో ఏదైన ఫిర్యాదులు వస్తే వాటిపై వెంటనే దృష్టిసారించి పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలలో గల మార్గదర్శకాలపై జేసిలు ఎం.గౌతమి, సి.ఎం.సాయికాంత్ వర్మ లు వీసీ ద్వారా వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్వో మాలోల, సబ్ కలెక్టర్లు ఐ. పృథ్వి తేజ్, కేతన్ గార్గ్, ఆర్డిఓ నాగన్న, తాసిల్దార్ లు ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.