చెన్నైలో రజనీకాంత్ అభిమానుల నిరసన
చెన్నై: అర్జున్ హీరోగా నటించిన ఒకేఒక్కడు సినిమా గుర్తుందా.. ఆ సినిమాలో పురుషోత్తం(అర్జున్) రాజకీయాల్లోకి రావాలని ఆయన ఒక్కరోజు పాలన మెచ్చిన వారంతా కోరతారు. తనకీ రాజకీయాలు వద్దంటూ, తానూ సామాన్యుడినేనంటూ పురుషోత్తం దాటవేసే ప్రయత్నం చేస్తాడు. అయితే.. ఓ దివ్యాంగుడు పురుషోత్తంను చూసేందుకు వచ్చి అతనితో చెప్పే మాటలతో పురుషోత్తం మనసు మార్చుకుని రాజకీయాల్లోకి వస్తాడు. సరిగ్గా ఇలాంటి దృశ్యమే ఆదివారం చెన్నైలో కనిపించింది. ఓ దివ్యాంగుడు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు తలపెట్టిన శాంతియుత నిరసనలో పాల్గొన్నాడు. ఆ దృశ్యం చూపరుల హృదయం ద్రవించేలా చేసింది.తలైవా మనసు మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ దివ్యాంగుడు కోరాడుతమిళనాడు రాజధాని చెన్నైలో రజినీకాంత్ అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దాదాపు రెండు వేల మందికి పైగా ఒకచోట చేరి రజినీ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నినాదాలు చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు విముఖత వ్యక్తం చేసిన రజినీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. చెన్నై పోలీసులు కేవలం 200 మందికి మాత్రమే గంట పాటు అనుమతినివ్వగా, దాదాపు 2వేల మందికి పైగా రజినీ అభిమానులు అక్కడికి చేరుకోవడం విశేషం. ‘వా తలైవా వా’, ‘ఇప్పో ఇల్లన ఎప్పొవమ్ ఇల్ల’ వంటి నినాదాలతో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకూ చెన్నై నగరం మారు మోగింది. నిరసన తెలిపిన ప్రాంతమంతా రజినీ బ్యానర్లు, ప్లకార్డులతో నిండిపోయింది. ఇలాంటి నిరసనలకు దిగవద్దని, అభిమాన హీరో నిర్ణయాన్ని గౌరవించాలని రజినీ మక్కల్ మండ్రం అభిమానులకు విన్నవించినప్పటికీ ఫ్యాన్స్ ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం గమనార్హం
.