చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూశాక జగన్ పై 30 కేసులు బనాయించారు: సజ్జల

సీఎం జగన్ పై నమోదైన కేసుల ఎత్తివేత అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎం జగన్ పై గతంలో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూశాక, జగన్ పై ఇష్టం వచ్చిన రీతిలో 30 కేసుల వరకు నమోదయ్యాయని వెల్లడించారు. అవి అసలు కేసులే కాదని పేర్కొన్నారు.
గత 10 సంవత్సరాలుగా జగన్ పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని అన్నారు. కొన్ని చానళ్లు దుష్ప్రచారం సాగిస్తున్నాయని, కేసులు వేస్తూ రాష్ట్ర సర్కారు పనితీరుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని తెలిపారు.
గతంలో టీడీపీ నేతలపై ఉన్న కేసులను చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిందని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నేర్పరి అని సజ్జల పేర్కొన్నారు. వ్యవస్థల్లోని కీలక వ్యక్తులను కుట్రలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పథకం ప్రకారం అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.