గుడ్డు మాంసం తినాలా వద్దా
గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి విజృంభణ తో అల్లాడిపోయిన దేశ ప్రజలు కరోనా వ్యాక్సిన్ అతి త్వరలో రాబోతుంది అని కొంచెం ఉపశమనం పొందేలోపే దేశంల బర్డ్ఫ్లూ విజృంభణ ఎవరిని నిద్రపోనివ్వడం లేదు. ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో గుడ్డు మాంసం తినాలా వద్దా అని చర్చించుకుంటున్నారు. వీటిపై ఎన్నో అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు వాటి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల ద్వారా మనుషులకూ వైరస్ సోకుతుందని కొందరు చెబుతున్నారు.
అయితే బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన పక్షులను దగ్గరికి తీసుకోవడం వాటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల వైరస్ మనుషులకు వ్యాపించే అవకాశముందని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది. బాగా ఉడికించిన గుడ్లు మాంసం తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది. అధిక ఉష్ణోగ్రతలను బర్డ్ ఫ్లూ వైరస్ తట్టుకోలేదని అందువల్ల ఆహారాన్ని కనీసం 70 డిగ్రీల వరకు ఉడికిస్తే వైరస్ చనిపోతుందని డబ్ల్యూహెచ్ వో చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విపరీతంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది.కోళ్లు చనిపోతుండడంతో గడ్లు చికెన్ తినొద్దనే తెగ ప్రచారం జరుగుతోంది. వైరస్ ప్రమాదం లేని ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ బయటపడని రాష్ట్రాల్లో చికెన్ ఎప్పటిలాగానే తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధిని గుర్తించిన పౌల్ట్రీ పరిశ్రమల నుంచి ఉత్పత్తులను ఎలాంటి పరిస్థితుల్లో విక్రయాలు జరుపొద్దని వెల్లడిస్తున్నారు. ప్రధానంగా హాఫ్ బాయిల్డ్ సగం ఉడికించిన మాంసాన్ని అస్సలు తినకూడదంటున్నారు. పచ్చి మాంసం శుభ్రంగా కడగాలని మాంసాన్ని ముట్టుకున్న తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలని పేర్కొంటున్నారు. చికెన్ ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు మాంసాన్ని తప్పకుండా 70 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత్త వద్ద ఉడికించి తీసుకోవాలని సూచిస్తున్నారు.