కృష్ణానదీ యాజమాన్యం బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సిఎం జగన్ పాలనలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వేంపల్లెలో అయన విలేకరులతో మాట్లాడుతూ కృష్ణానది యాజమాన్యం బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో కాకుండా విశాఖలో పెట్టాలని నిర్ణయించడాన్ని ఆయన ఖండించారు. కేంద్రంతో పోరాడి రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు తెప్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అలాగే కడప జిల్లాకు స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడంలోనూ వైఫల్యం చెందిందని విమర్శించారు. రాయలసీమకే తలమానికమైనా ధర్మల్ పవర్ ప్లాంట్ జగన్ పాలనలో మూతపడిందన్నారు.రాయలసీమ వాసులకు ఏమాత్రం సౌకర్యం కాని, దూరంగా ఉన్న విశాఖకు రాజధాని తరలించాలనే నిర్ణయం రాయలసీమకు శాపమని తెలిపారు. కృష్ణానది యాజమాన్యం బోర్డును రాయలసీమలో కాకుండా విశాఖలో పెట్టాలని కృష్ణానది బోర్డుకు రాష్ట్రప్రభుత్వం లేఖ రాయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. కృష్ణానదికి సంబంధించిన శ్రీశైలం రిజర్వాయర్ ప్రధానమైందని, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగునీటి అవసరాలకు సంబంధించిన తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులన్నీ శ్రీశైలం రిజర్వాయర్ మీదే ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, తెలంగాణ నిర్మిస్తున్న ఆక్రమ ప్రాజెక్టులు పాలమూరు-రంగారెడ్డి-దిండి ఎత్తిపోతల పథకం కూడా శ్రీశైలం రిజర్వాయర్ నుండే అన్నారు. కాబట్టి కృష్ణానదీ యాజమాన్యం బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.