కూకట్పల్లిలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
హైదరాబాద్లోని కూకట్పల్లిలో గురువారం పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏటీఎం మిషన్ లో డబ్బు నింపే సమయంలో ఇద్దరు దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి ఆ డబ్బు లో నుండి కొంతమొత్తం నగదును ఎత్తుకుపోయారు. కూకట్ పల్లి మెయిన్ రోడ్ లో ఉన్న హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. హెచ్ డీఎఫ్సీ బ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎంలో సిబ్బంది రోజూ డబ్బులు నింపుతుంటారు. ఈరోజు మధ్యాహ్నం కూడా సెక్యూరిటీ గార్డుతో కలిసి ఓ ఉద్యోగి డబ్బుతో ఏటీఎంతో నగదు నింపేందుకు వెళ్లారు. ఏటీఎం మిషన్ ఓపెన్ చేసి నగదు నింపుతుండగా లోనికి వచ్చిన ఇద్దరు దుండగులు వారిపై కాల్పులు జరిపి నగదు తీసుకుని పరారయ్యారు.
ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు ఆలీతో పాటు బ్యాంకు ఉద్యోగి అక్కడిక్కడే తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్ధంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అక్కడికి చేరుకునేసరికే దుండగులు నగదుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు క్షణాల్లోనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే సెక్యూరిటీ గార్డు ఆలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైందని అందువల్లే అతడిని కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉందట. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రజలు వణికిపోయారు. ఆ దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సమయంలోనే దుండగులు ఎందుకు వచ్చారు? వారికి ముందుగానే సమాచారం అందిందా? లేక ఇంటి దొంగలే ఈ ప్లాన్ చేసుకున్నారా? అనే విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు.