కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు తెదేపా అధినేత చంద్రబాబు

గుడిపల్లె: సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటూ ఓటర్లను బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో వైకాపా దొడ్డిదారిన గెలిచిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కుప్పం పర్యటనలో భాగంగా గుడిపల్లెలో నిర్వహించిన తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించడం వల్ల కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. కుప్పంలో జూద సంస్కృతి తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారుల పనితీరును సమీక్షిస్తానని చెప్పారు.
కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో మాఫీ చేస్తానన్నారు. కుప్పం కార్యకర్తల కోసం ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పారు.
కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు
”కుప్పం ప్రజలను భయపెట్టి నన్ను దెబ్బతీయాలనుకున్నారు. మందుపాతరలకే నేను భయపడలేదు. 40 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో అలజడులు సృష్టించారు. ఇక్కడ చోటా వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. డబ్బుల వసూళ్లకు ఉబలాటపడుతున్నారు. పుంగనూరులో ఓ మహానేత సర్వం దోచుకుంటున్నారు. గతంలో 24 గంటలూ రాష్ట్రం, ప్రజల కోసమే ఆలోచించాను. విభజనతో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కష్టబడ్డా. ఈ క్రమంలో మిమ్మల్ని విస్మరించాను. నా సమయంలో 25 శాతం కార్యకర్తల కోసం వెచ్చించి ఉంటే మనకీ ఇబ్బందులు వచ్చేవి కాదు. పొరపాటు జరిగింది. భవిష్యత్‌లో ఇలా జరగదని స్పష్టం చేస్తున్నా. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదు. మీకు అండగా ఉంటా. తప్పకుండా ఏం చేయాలో చేద్దాం. గతాన్ని తలచుకుంటే ముందుకెళ్లలేం. పార్టీ ఇబ్బందుల్లో ఉంటే మనల్ని మనం విమర్శించుకుంటే బలహీనమవుతాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
వాళ్ల నిజస్వరూపం బయటపడింది.
నన్ను ఎన్ని అవమానాలకు గురిచేస్తున్నారో మీరు చూస్తున్నారు. నాకు మళ్లీ సీఎం పదవి అవసరమా? కానీ..రాష్ట్రం, ప్రజలు, నమ్ముకున్న కార్యకర్తల కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నా. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వంపై విశ్వసనీయత పోయింది. 20 నెలల్లోనే సీఎం చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది కలెక్టర్లు, ఎస్పీలను చూశాను. ఇప్పుడు వాళ్ల నిజస్వరూపం బయటపడింది. ఇవన్నీ నాకు కూడా మంచి గుణపాఠాలు. మనం భయపడితే బెదిరిస్తారు. తిరుగుబాటు చేస్తే నోరుమూస్తారు. నియోజకవర్గంలో కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండాలి. నాయకత్వాన్ని గౌరవించాలి. బాగా పనిచేసే వారిని ముందుకు తీసుకెళ్లాలి. సమర్థ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తా. కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటా” అని చంద్రబాబు అన్నారు.