కర్ణాటక ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళతో ఉన్న 13 సరిహద్దులను మూసివేస్తూ నిర్ణయం
దేశంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మహారాష్ట్రలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో టెస్టులను పెంచారు. ఆంక్షలు కఠినం చేశారు. ఇప్పటికే అమరావతి, యావత్మల్ జిల్లాల్లో వారం రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఇక కేసులు పెరుగుతున్న పూణే లో కూడా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. మరోవైపు కేరళ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగురాష్ట్రమైన కర్ణాటక ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళతో ఉన్న 13 సరిహద్దులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి వచ్చే అన్ని రహదారులను మూసివేసింది. కర్ణాటక తీసుకున్న నిర్ణయంపై కేరళ మండిపడుతున్నది. కర్ణాటక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని, దీనివలన కేరళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నది.కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు నిత్యం రెండు రాష్ట్రాల్లోకి రాకపోకలు చేస్తుంటారని, ఇప్పటికే నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్న కర్ణాటక, ఇప్పుడు సడెన్ గా సరిహద్దులు మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం బాధాకరమైన విషయమని కేరళ నేతలు చెప్తున్నారు.