కరోనా మహమ్మారిపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి గురించి పెద్దగా అవగాహన లేని వేళలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరు అత్యుత్సాహవంతులైతే జగన్ ను ట్రోల్ చేసేందుకు చాలానే కష్టపడ్డారు. అవగాహన లేమితో జగన్ వ్యాఖ్యల్నిఅర్థం చేసుకోలేని వారు.. కాల పరీక్షలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఎంత విలువైనవో అర్థమైంది. కరోనాపై తాను చేసిన వ్యాఖ్యల్ని ఎటకారం చేసిన వారిపై అస్సలు స్పందించని జగన్.. కరోనాపై ఆ తర్వాత పెద్దగా స్పందించింది లేదు.
ఇన్నాళ్ల తర్వాత మరోసారి కరోనా మహమ్మారిపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు.. ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించిన ఆయన.. గురువారం తాను వ్యాక్సిన్ వేయించుకోనున్నట్లు వెల్లడించారు. పరిషత్ ఎన్నికల తర్వాత వ్యాక్సినేషన్ మీద మరింత ఫోకస్ చేయాలన్నారు. అంతేకాదు.. ఏపీని కరోనా నుంచి విముక్తి చేసేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ ను ఆయన వివరంగా వెల్లడించారు.
కొవిడ్ ను తరిమికొట్టాలంటే వ్యాక్సినేషన్ తప్ప మరో మార్గం లేదన్న కీలక వ్యాఖ్య చేశారు. అందుకే.. టీకా కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ‘కొవిడ్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. టీకా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. గ్రామ సచివాలయం.. వార్డు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకొని వాలంటీర్లు.. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలి. ఫలానా రోజున వైద్యులు టీకా వేయటానికి వ్స్తారని చెప్పటమే కాదు.. మిగిలిన సిబ్బంది మొత్తం అదే రోజు గ్రామంలోనే ఉండి సచివాలయం వద్ద అందరికి వ్యాక్సిన్ వేయించాలి. అలా చేస్తే తప్ప కరోనాను అడ్డుకోలేం’ అని తేల్చారు. కరోనాకు చెక్ పెట్టే విషయంలో చాలా రోజుల తర్వాత జగన్ చేసిన కీలక వ్యాఖ్యగా దీన్ని చెప్పాలి.