కజకిస్తాన్లో నిరసన మంటలు… ఎమర్జన్సీ విధింపు –

అధ్యక్ష నివాసానికి నిప్పు
- 8మంది పోలీసు అధికారుల మృతి, 300మందికి పైగా గాయాలు
ఆల్మాటీ : ఇంధన ధరలపెంపుపై రగిలిన నిరసన జ్వాలలు కజకిస్తాన్ అంతటా దావానలంలా వ్యాపించాయి.
దక్షిణాసియాలో అత్యంత సుస్థిర దేశంగా భావించే ఈ పూర్వపు సోవియట్ రిపబ్లిక్ నేడు నిరసనలతో అట్టుడుకుతోంది. అల్మాటీలోని మేయర్ భవనమే కాదు, అధ్యక్ష భవనానికి కూడా నిరసనకారులు నిప్పంటించారు. మిర్ టెలివిజన్ కేంద్రంపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. నిరసనల ధాటికి తట్టుకోలేక కజకిస్తాన్ ప్రభుత్వం బుధవారం రాజీనామా చేసింది. అయినా, నిరసనలు ఆగలేదు. ఇంధన ధరల పెంపునకు మూలమైన నయా ఉదారవాద విధానాలను వారు ప్రశ్నిస్తున్నారు. నిరసనలను అణచివేసేందుకు అధ్యక్షుడు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. రెండు వారాల పాటు ఈ ఎమర్జన్సీ అమల్లో వుంటుందని తెలిపారు. ఇంధన వనరులు సమృద్ధిగా గల ఈ దేశం దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
గడ్డ కట్టే చలిలో కూడా జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలను, గ్రెనేెడ్లను ప్రయోగించారు. నిరసనల సందర్భంగా చెలరేగిన హింసలో ఎనిమిదిమంది పోలీసు అధికారులు, నేషనల్ గార్డు సభ్యులు మరణించారని, 300మందికి పైగా గాయపడ్డారని అధ్యక్షుడు కసామ్ జోమార్ట్ టకెయెవ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత కఠినంగా వ్యవహరించాలని భావించామని, ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కజకిస్తాన్ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని మనందరం కలిసి అధిగమించాలని అన్నారు.
కొత్త సంవత్సరంలో ఎల్‌పిజి ధరలను రెట్టింపు చేయడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 1991లో సోవియట్ యూనియన్ నుండి విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకున్న తర్వాత నుంచి ఒకే పార్టీ పాలనలో వుండడంతో దేశ ప్రజల్లో అసంతృప్తి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది.
శాంతి పరిరక్షక బలగాలను మోహరించనున్న సిఎస్‌టిఓ
దేశంలో పరిస్థితులను అదుపులోకి తేవడంలో సాయం కావాలని అధ్యక్షుడు కోరినందున ఆ దేశానికి శాంతి పరిరక్షక బలగాలను పంపాలని సిఎస్‌టిఒ (సమిష్టి భద్రతా ఒప్పంద సంస్థ ా కలెక్టివ్ సెక్యూరిటీ ట్రియటీ ఆర్గనైజేషన్) సెక్యూరిటీ కౌన్సిల్ గురువారం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్మేనియా ప్రధాని, కౌన్సిల్ చైర్మన్ నికోల్ పషిన్యాన్ తెలిపారు. ఆ దేశంలో సుస్థిర పరిస్థితులు నెలకొనేవరకు పరిమిత కాలం పాటు ఈ బలగాలు అక్కడ వుంటాయని పేర్కొన్నారు.