ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. రంగంలోకి డీజీ సంజయ్
పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్.సంజయ్ బాధ్యతలు అప్పగించింది. ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో భేటీ.
ఏపీలో పంచాయతీ ఎన్నిలకు ఎస్ఈసీ సిద్ధమైంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించింది. ఎన్నికల పర్యవేక్షణ కోసం పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్.సంజయ్ బాధ్యతలు అప్పగించింది. ఆయన ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సమావేశమయ్యారు.. ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. సంజయ్‌కి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్‌ని కూడా ఏర్పాటు చేశారు.
గతేడాది మార్చిలో పరిషత్, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలతో ముందుగానే అప్రమత్తం అయ్యారు. భద్రత, బందోబస్తు ఎలా ఉండాలి.. సమస్యాత్మక గ్రామాల్లో బలగాల మోహరింపు, సమస్యలు సృష్టించే వ్యక్తుల బైండోవర్, డ్రోన్లతో పర్యవేక్షణ, నిఘా యాప్ వంటి అంశాలపై చర్చించారట. సంజయ్ డీజీపీ, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, నిఘా విభాగం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇటు 13 జిల్లాల ఎస్పీలతో డీజీపీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో చిన్న ఘటన కూడా జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.