ఎన్నికల్లో పోటీ ఎవరు అన్న అంశంపై చర్చలు

పులివెందుల జనవరి 29:- పంచాయతీ ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి సందడిగా ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు పంచాయతీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ ఎవరు అన్న అంశంపై చర్చలు జోరందుకున్నాయి. పులివెందుల నియోజకవర్గ పరిధిలో మొత్తం 109 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పులివెందులలో 06 పంచాయతీలు, చక్రాయపేటలో 16, వేంపల్లెలో 17, వేములలో 16, తొండూరులో 15, లింగాలలో 19, సింహాద్రిపురంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీలైనంతవరకూ ఏకగ్రీవ పంచాయతీలకే ప్రభుత్వం కృషిచేస్తోంది. అయితే, నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు టిడిపి మద్దతుదారులను పోటీలో నిలుపుతామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు ఎన్నికల్లో ప్రధానంగా వైసిపి, టిడిపిల మధ్యనే హౌరాహౌరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరొకవైపు 90 శాతం గ్రామ పంచాయతీలను ఏకగ్రీవాలుగా చేసుకునేందుకు వైసిపి నాయకులు పావులు కదుపుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో వైసిపి మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ నాయకులు కృషి చేయనున్నారు. అలాగే టిడిపి నాయకులు కూడా మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.