ఎన్నికలు జరగాల్సిందే.. భయపడొద్దు .. అవసరమైతే నేనే వస్తా.. చంద్రబాబు.

మన జన ప్రగతిి-: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తున్నామని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎవరని ఆయన నిలదీశారు. అసలు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు, సీఎంకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తాజాగా ఎస్‌ఈసీ జారీ చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై ఆ పార్టీకి చెందిన పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు స్వీకరించాలని చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. పూర్తిగా కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణలో గ్రామ వాలంటీర్లకు ఎలాంటి భాగస్వామ్యం కల్పించవద్దని.. గతంలో ఎన్నికల విధులకు సిఫార్సు చేసిన అధికారులను తప్పించాలన్నారు. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేసి అన్ని స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల్లో పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలన్నారు. ఎన్నికల కోడ్ వల్ల సీఎం ఇక ఇంటికే పరిమితమవుతారని.. తెదేపా నాయకులెవరూ భయపడొద్దన్నారు. అవసరమైతే తాను సైతం క్షేత్రస్థాయికి వస్తానని పార్టీ శ్రేణులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.