ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందన
స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. ఎన్నికల నిర్వహణ విషయంలో కలిసికట్టుగా పని చేద్దామంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కరోనా సోకకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు, ఫేస్ షీల్డ్స్ అందుబాటులో ఉంచుతున్నామన్న ఆయన ఈ మేరకు వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రోసీడింగ్సులో ఈ విషయాలను ప్రస్తావించానని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రయార్టీ ఇవ్వాలని సూచించామని అన్నారు. రాజకీయ పార్టీల విస్తృతాభిప్రాయం మేరకే ఎన్నికల నిర్వహణ చేస్తున్నామని ఆయన అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం ఉండదన్న ఆయన పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తే ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొవడంలో ఏపీ అధికార యంత్రాంగానికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్న ఆయన కలిసి పని చేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహిద్దామని అన్నారు.