ఇంద్రకీలాద్రి ఆలయంలో పనిచేసే 13మంది ఉద్యోగుల్ని సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో పనిచేసే 13మంది ఉద్యోగుల్ని సస్పెన్షన్కు ఆశాఖ కమిషనర్ కీలక ఆదేశాలు జారీచేశారు. వీరిలో ఐదుమంది సూపరింటెండెంట్ స్థాయి సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. దుర్గ గుడిలో ఏసీబీ అధికారులు దాడులు చేసి పలు కీలక పత్రాలను అవినీతి ఆధారాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వగా భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అన్నదానం టిక్కెట్ల అమ్మకాలు చీరల విభాగాల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు. గుడి భూములు షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం దర్శనాల టికెట్ల అమ్మకం అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్నదానం స్టోర్స్ హౌస్ కీపింగ్ విభాగపు సూపరింటెండెంట్లతో పాటు గుడి భూములు షాపుల లీజు వ్యవహారాలను పర్యవేక్షించే విభాగపు సూపరింటెండెంట్ ఇంద్రకీలాద్రి కొండపై వివిధ రకాల కౌంటర్లను నిత్యం పర్యవేక్షించే సూపరింటెండెంట్లను సస్పెండ్ చేస్తూ సురేష్బాబు చర్యలు తీసుకున్నారు. దర్శన టికెట్ల అమ్మకం కౌంటర్ లో పనిచేసే ముగ్గురితో పాటు ప్రసాదాల పంపిణీ అమ్మవారి చీరలు భద్రపరిచే విభాగం ఫొటోల అమ్మకం విభాగాల్లో పనిచేసే సిబ్బందిని ఈవో సస్పెండ్ చేశారు.
ఇటీవల కనకదుర్గమ్మ ఆలయం తరచూ వివాదాల్లోనే నిలుస్తోంది. అమ్మవారి వెండిరథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు నాలుగు నెలల విచారణ అనంతరం నిందితులను పట్టుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా భక్తులను అనుమతించడం ముందస్తు బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.