అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 1.24 కోట్ల లబ్ధిదారుల మేలు మంత్రి కొడాలి నాని
గుడివాడ , ఫిబ్రవరి 6 : అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 1.24 కోట్ల లబ్ధిదారులకు మేలు చేకూరుతోందని, రూ .50 వేల 940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళను సీఎం జగన్మోహనరెడ్డి నిర్మిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు. గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని స్థానిక మందపాడు ఆదర్శనగర్‌కు చెందిన కోటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి పేరుమీద గతంలో టిడ్కోగృహం మంజూరైందని తెలిపారు. రూ. 25 వేల మొత్తాన్ని మున్సిపాలిటీకి డిడి రూపంలో చెల్లించామని, అయితే లబ్ధిదారుల జాబితాలో పేరును తొలగించారని చెప్పారు. సచివాలయ సిబ్బందిని అడిగితే 70 ఏళ్ళు వయస్సు పైబడి ఉండడం వల్ల టిడ్కో జాబితా నుండి పేరును తొలగించినట్టుగా చెబుతున్నారని, ఈ గృహాన్ని ఇప్పించాలని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 365 , 430 చదరపు అడుగుల్లో నిర్మించే టిడ్కో గృహాలకు లబ్ధిదారుని వాటాతో పాటు బ్యాంక్ రుణం చెల్లించాల్సిన ఉంటుందన్నారు. వయస్సు పైబడిన వారికి బ్యాంకు రుణాలు ఇచ్చే అవకాశం ఉండదన్నారు. కోటేశ్వరరావు తల్లికి అర్హతలుంటే జగనన్న కాలనీలో ఇంటి స్థలం పట్టా మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. పట్టా కేటాయించిన ప్రాంతంలో ప్రభుత్వమే రూ. 1.80 లక్షల వ్యయంతో ఇంటిని నిర్మిస్తుందని , బ్యాంక్ కు ఒక్క రూపాయి రుణం కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ 25 వ తేదీన 30.75 లక్షల ఇళ్ళస్థల పట్టాల కార్యక్రమానికి సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించారన్నారు. వీటి విలువ రూ. 28 వేల కోట్లు ఉంటుందన్నారు. వీటితో పాటు 2.62 లక్షల టీడ్కో ఇళ్ళకు కూడా సేల్ అగ్రిమెంట్ ఇవ్వనున్నారని తెలిపారు. రెండవ దశలో మరో 12.70 లక్షల ఇళ్ళ నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో 17 వేలకు పైగా జగనన్న కాలనీలు ఏర్పడనున్నాయన్నారు. ఈ కాలనీల్లో వైఎస్సార్ జనతా బజార్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, బస్టాప్, అంగన్‌వాడీ కేంద్రం, ఫంక్షన్ హాలు, ప్రైమరీ స్కూల్, హైస్కూల్, కమ్యూనిటీ హాలు, పార్క్ ల వంటివి ఏర్పాటవుతాయన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ప్రతిపక్ష నేతగా 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన జగన్మోహనరెడ్డి పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా అర్హతలుంటే ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కట్టిస్తామని మేనిఫెస్టోలో చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండే ఇళ్ళస్థల పట్టాల పంపిణీకి దిశానిర్దేశం చేశారని, 30.75 లక్షల ఇళ్ళస్థలాలు ఇవ్వడంతో పాటు ఉచితంగా ఇళ్ళను కూడా నిర్మించి ఇవ్వబోతున్నారని చెప్పారు. జగనన్న కాలనీలో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలనూ కల్పించేందుకు మరో రూ. 7 వేల కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిపారు. సగంలో వదిలేసిన 2.62 లక్షల టిడ్కో ఇళ్ళకు గత ప్రభుత్వం రూ. 3 వేల కోట్ల బకాయిలు పెట్టిందని, ఈ ఇళ్ళను పూర్తిచేయడానికి మరో రూ. 9,500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు.