అంతర్వేది రథాన్ని లాగిన సీఎం జగన్
: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామివారి వార్షిక కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన రథానికి పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి దాన్ని లాగారు. వేదపండితులు, ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణల, భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్..వారితో కలిసి కొద్దిదూరం రథాన్ని లాగి, ప్రారంభించారు.దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు రాజోలుకు చెందిన జనసేన శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్..
ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకున్నారు. నూతన రథాన్ని లాగారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వేలాదిమంది భక్తులు అంతర్వేది లక్ష్మీనారసింహుడిని దర్శించుకున్నారు.
ఇదివరకు ఉన్న స్వామివారి రథం అనుమానాస్పద స్థితిలో మంటలబారిన పడి దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జగన్ సర్కార్.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణకు ఆదేశించింది. రథం దగ్ధం కావడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. జగన్ పరిపాలనలో హిందుత్వంపై దాడి జరుగుతోందంటూ ఆరోపణలను ఆయన రాజకీయ ప్రత్యర్థులు సంధించారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసానికి అధికార పార్టీ నేతలే కారణమంటూ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు ఆందోళనలను వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల మధ్య అంతర్వేది ఆలయానికి ప్రభుత్వం కొత్తగా రథాన్ని నిర్మించి ఇచ్చింది. దీని కోసం 90 లక్షల రూపాయలను వ్యయం చేసింది. అన్ని హంగులతో రథాన్ని రికార్డు సమయంలో నిర్మించింది ప్రభుత్వం. సంప్రదాయబద్ధంగా రథం నిర్మాణాన్ని చేపట్టింది. అయిదు నెలల్లోనే దాన్ని పూర్తి చేసింది. కొద్దిరోజుల కిందటే నూతన రథం సంప్రోక్షణ పనులను కూడా వైభవంగా నిర్వహించింది. రథం సంప్రోక్షణ పనులు మూడు రోజుల పాటు కొనసాగాయి. పలువురు పీఠాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని.. నూతన రథాన్ని దేవస్థానానికి అప్పగించింది ప్రభుత్వం.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు రాజోలుకు చెందిన జనసేన శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్..