అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలు పెంపు!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ అంగన్ వాడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలను పెంచడంతో పాటు ప్రమోషన్లను ఇవ్వనుంది. అదే సమయంలో ఉద్యోగులకు మరికొన్ని ప్రయోజనాలను కల్పించనుంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.
త్వరలోనే ప్రమోషన్లు కల్పించడంతో పాటు జీతాలను పెంచుతామని మంత్రి చేసిన ప్రకటన పట్ల అంగన్ వాడీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన భర్తీ ప్రక్రియను కూడా చేపడతామని మంత్రి తెలిపారు. మంత్రి ఇదే సమయంలో ఇబ్బందులు, కష్టాలు పడుతున్న అంగన్ వాడీ సిబ్బందికి బీమా కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అంగన్ వాడీ వర్కర్లను టీచర్లని పిలవాలని చెప్పారని.. అంగన్ వాడీ వర్కర్లకు సమాజంలో సముచిత గౌరవం కల్పించే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే అంగన్ వాడీ ఖాళీల భర్తీ జరుగుతుందని.. ఈసారి కూడా వేతనాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అంగన్ వాడీ ద్వారా ప్రయోజనం కల్పించాలని ఆమె అన్నారు.
మంత్రి ప్రత్యేకంగా తయారు చేసిన చీరలను అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, మినీ అంగన్‌వాడీ టీచర్లకు పంపిణీ చేశారు. అంగన్‌వాడీలకు ప్రయోజనం చేకూరే విధంగా మంత్రి కీలక ప్రకటనలు చేయడంతో పాటు త్వరలో ఖాళీలను భర్తీ చేయనుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.